అదరకొట్టిన రోహిత్…సిరీస్ సొంతం చేసుకున్న భారత్…

అదరకొట్టిన రోహిత్…సిరీస్ సొంతం చేసుకున్న భారత్…

బ్రిస్టల్, 9 జూలై:

పొట్టి ఫార్మాట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరోసారి తనకి తిరుగులేదని నిరూపించింది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుని వారి గడ్డ మీదే ఓడించి సత్తా చాటింది. బ్రిస్టల్ వేదికగా జరిగిన చివరిదైనా మూడో టీ-20లో 7 వికెట్లతేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించి 2-1 తేడాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. 199 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ నిర్దేశించగా.. రోహిత్‌శర్మ (100 నాటౌట్: 56 బంతుల్లో, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో రెచ్చిపోవడంతో మరో 8 బంతులుండగానే సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది.

సిరీస్ గెలవాలంటే తప్పక నెగ్గాల్సిన చివరిమ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్..ఇంగ్లండ్ జట్టుని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కి వచ్చిన ఓపెనర్లు రాయ్‌(67), బట్లర్‌(34) మెరుపు ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా రాయ్‌ ఊచకోతకు భారత బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. అయితే చివరి ఓవర్లలో బౌలర్లు ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు.

దీంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీస్కోరు సాధించింది. భారత బౌలర్లలో పాండ్యా 4 వికెట్లు పడగొట్టగా, కౌల్ 2, దీపక్ చహార్, ఉమేశ్‌కు తలో వికెట్ దక్కింది.

అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆరు ఓవర్లలోపే ధవన్‌ (5), రాహుల్‌ (19) అవుటయ్యారు. కానీ రోహిత్‌ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తొలి ఓవర్‌లోనే సిక్స్‌ బాదిన తను రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు సాధించాడు.

ఇక జోర్డాన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో అయితే 4, 6, 6తో చెలరేగాడు. పవర్‌ప్లేలో జట్టు 70 పరుగులు చేయగలిగింది.. 28 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన రోహిత్‌ ఆ ఆతర్వాత రెచ్చిపోయి ఆడాడు. ఇక ఓవైపు కుదురుకుంటున్న కోహ్లీ 15వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఈ దశలో పాండ్యా అతడికి జత కలిశాడు. ఈ జోడీ ఇంగ్లండ్‌ బౌలర్లపై యధేచ్ఛగా దాడికి దిగింది. 18వ ఓవర్‌లో పాండ్యా 6, 4, 4 సాధించాడు. ఆ తర్వాత 19వ ఓవర్‌లో రోహిత్‌ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేయగా పాండ్యా ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. చివరిమ్యాచ్‌తోపాటు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌శర్మ మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

మామాట: ఇదే దూకుడు వన్డే సిరీస్‌లో కూడా కొనసాగుతుందో లేదో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *